రుణమాఫీ, రైతుభరోసా, పంటల బీమా.. కీలక నిర్ణయం దిశగా తెలంగాణ సర్కార్!
సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ ఈ నెల 20న సచివాలయంలో జరగనుంది.
By అంజి
రుణమాఫీ, రైతుభరోసా, పంటల బీమా.. కీలక నిర్ణయం దిశగా తెలంగాణ సర్కార్!
హైదరాబాద్: సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ ఈ నెల 20న సచివాలయంలో జరగనుంది. ఈ భేటీలో వ్యవసాయ రుణమాఫీ పూర్తిగా అమలు చేయడం, రైతు భరోసా, పంటల బీమా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీకి ఆమోదం, పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణమాఫీని ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే దశల వారిగా చేసిన మాఫీ చేసిన కొందరికి రుణాలు మాఫీ కాలేదు. అలాగే కొందరికి రూ.2 లక్షలపైన రుణం ఉండటంతో మాఫీ కాలేదు. ఈ క్రమంలోనే వీరికి దశల వారీగా మాఫీ చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.
పంట పెట్టుబడుల సాయం అందించే రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ చేపట్టంది. పంటలు వేసిన వారికే సాయం అందిస్తామని ఇప్పటికే మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. వానాకాలం పంట ముగింపు దశకు చేరుకున్న ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ పథకం అమలు చేయలేదు. పథకం అమలు చేయాలని ప్రభుత్వంపైనా ఒత్తిడి వస్తోంది. దీనిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం వెల్లడించనుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో బీమా అమలు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై పూర్తి వివరణ ఇవ్వనున్నారు.