తెలంగాణలోని మహిళా నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్. త్వరలోనే రాష్ట్రంలోని 11 వేల అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. అలాగే 15 వేల అంగన్‌వాడీ సెంటర్లలో ప్లే స్కూళ్లు ప్రారంభిస్తామని చెప్పారు. గురువారం నాడు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డిపార్ట్‌మెంట్ పాలన తీరు, కొత్త ఆలోచనలు, వాటి కార్యచరణ, ఇతర అంశాలను సీతక్క వివరించారు. స్త్రీ శిశు సంక్షేమంలో అంగన్‌వాడీలదే కీలకపాత్ర అని మంత్రి సీతక్క అన్నారు. లోపాలను అరికట్టి అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పర్యవేక్షణ చర్యలు చేపట్టామని వివరించారు.
గతంలో అంగన్‌వాడీ సెంటర్లకు గుడ్ల సరఫరా కాంట్రాక్టును 2 సంవత్సరాల ఒకే కాంట్రాక్టర్‌కు ఇవ్వడం వల్ల నిర్లక్ష్య వైఖరి కనిపించింది. తాము వచ్చాక ఆ రూల్స్‌ని పూర్తిగా మార్చామని తెలిపారు. ఆహారం, గుడ్ల సరఫరా పకడ్బందీగా సాగుతోందని, అంగన్‌వాడీలకు ఫర్నిచర్, ఇతర సామగ్రిని సమకూర్చామని వివరించారు. అంగన్‌వాడీల్లో 11 వేల ఖాళీలను గుర్తించామన్న మంత్రి సీతక్క.. త్వరలోనే వాటిని భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగ రిటైర్మెంట్ సమయంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ. లక్ష చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 35 వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, వీటిల్లో 15 వేలల్లో నర్సరీ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.