హైదరాబాద్: డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో వీరిని హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎల్బీ స్టేడియంలో జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులు తమ జిల్లా కౌంటర్‌లోనే నియామక పత్రాలను తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎంపికైన టీచర్లకు దసరా సెలువులు ముగిసేలోపలా పోస్టింగులు ఇచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
డీఎస్సీ పోస్టుల తుది ఫలితాలను ఇటీవల విద్యాశాఖ రిలీజ్ చేసింది. మొత్తం 11 వేల 62 పోస్టులకు 10,006 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్టు విద్యాశాఖ తెలిపింది. జిల్లాల వారీగా పోస్టుల వివరాలను వెల్లడించింది. మిగిలిన అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో ఉన్నట్టు పేర్కొంది. ఆ పోస్టుల్లో ఎంపికైన క్యాండిడేట్లు కోర్టు కేసులు, ఇతర కారణాలు ఉండటంతో పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపింది. వీటి భర్తీపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే సమాచారాన్ని అందజేశారు.