హైదరాబాద్: స్థలం ఉండి ఇళ్లులు లేని పేదలకు మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెండో దశలో స్థలం లేని వారికి స్థలం ఇచ్చి, ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభం అవుతుందన్నారు. లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు. ఈ నెల 15 నుంచి 20 తేదీల మధ్య గ్రామ సభలు నిర్వహిస్తామాని, ఈ సభల్లో అర్హులైన వారిని గుర్తించి లిస్ట్ ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం నిబంధనల ప్రకారం.. 80 గజాలా స్థలాన్ని లబ్ధిదారులకు ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
అందుబాటులో లేని చోట్ల భూమి కొనుగోలు చేసి మరీ కేటాయిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో స్పెషల్‌గా అధికారులను ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేది ఇందిరమ్మ ఇళ్లేనని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పేదిరకమే ప్రామాణికమని తెలిపారు. ఇంటి యజమానురాలి పేరుపైనే ఇల్లు మంజూరు చేసి, బిల్లులను చెల్లిస్తామన్నారు. ఉచితంగా ఇసుక సరఫరా చేసేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. సిమెంటు, స్టీల్ తదితరాలకు డిస్కౌంట్ విషయమై ప్రభుత్వం యోచిస్తోందన్నారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.