హైదరాబాద్: రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు నేటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా ఆయా గ్రామాలకు చేరింది. తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి వారి నుంచి గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది.
నేటి నుంచి 24వ తేదీ వరకు గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. కులగణన, సామాజిక, ఆర్థిక సర్వే, పాత రేషన్ కార్డుల జాబితా ఆధారంగా కొత్త కార్డుల జారీకి ప్రాథమిక జాబితా రూపొందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తాజాగా ఇచ్చే అప్లికేషన్లలో కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల పేర్లు, వారి ఆధార్ నంబర్లు, కులం, మతం, ఫోన్ నంబర్, అడ్రస్ వంటివి ఉండాలని పేర్కొన్నారు.