హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రెండో విడత లబ్ధిదారుల ఎంపిక నిన్నటితో ముగిసింది. రేపటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇల్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. రెండో దశలో 2.05 లక్షల మందిని ఎంపిక చేసినట్టు సమాచారం. మొదటి దశలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 71 వేల మందికి ఇళ్లను మంజూరు చేశారు. బేస్‌మెంట్ పూర్తి చేసిన వారి ఖాతాల్లో ప్రతి సోమవారం నిధులు జమ చేస్తున్నారు. ఈ పథకం మార్గదర్శకాల ప్రకారం.. ఒక్కో ఇంటికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షలు ప్రభుత్వం ఇస్తోంది.
కచ్చితంగా 600 చదరపు అడుగులలోపే ఇల్లు నిర్మాణం ఉండాలి. ఒక్క చదరపు అడుగు ఎక్కువగా ఉన్నా ఈ పథకం కింద లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అయితే మొదటి విడతలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి.. సిమెంట్ ధరల పెరుగుదల ప్రభావం పడింది. ఇప్పటికే పనులు ప్రారంభించిన లబ్ధిదారులు పెరిగిన సిమెంట్ ధరలపై ఆందోళన చెందుతున్నారు. సిమెంట్ బస్తా ధర దాదాపు రూ.30 నుంచి రూ.50 వరకు పెరిగినట్లు రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన సమయంలో సిమెంట్ బస్తా ధర రూ.280 నుంచి రూ.330 వరకు ఉంది. తరువాత రూ.30 నుంచి రూ.50 వరకు ధర పెరగడంతో రూ.10వేల వరకు అదనపు భారం పడే అవకాశముంది.