హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పింది. రైతులకు అవసరమైన యంత్రాలు, ఉపకరణాలను రాయితీపై సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రోటోవేట్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లను అందిస్తామని చెప్పారు. జిల్లాల వారీగా ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని యంత్ర పరికరాలు, పనిముట్ల జాబితాను తయారు చేశామన్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే వీటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
మంగళవారం నాడు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ బి.గోపి, ఇతర అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. పనిముట్లు, యంత్రాల తయారీ సంస్థల సహకారంతో రైతుల్లో అవగాహన కల్పిస్తామని, ఇందుకు జిల్లాల వారీగా ప్రదర్శనలు నిర్వహిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ స్కీంలో భాగంగా రోటోవేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, మొక్కజొన్న ఒలిచే యంత్రాలు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. రైతులకు సీజన్ ప్రారంభంలోనే పనిముట్లను అందజేయాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు.