బిగ్ అప్‌డేట్..ఏటీఎమ్ కార్డు సైజు, క్యూ ఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులు
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
By Knakam Karthik Published on 13 March 2025 10:22 AM IST
బిగ్ అప్‌డేట్..ఏటీఎమ్ కార్డు సైజు, క్యూ ఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులు
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కొత్త కార్డులతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూ ఆర్ కోడ్‌తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం టెండర్లను ఆహ్వానించింది. 760 మైక్రాన్స్ మందం, 85.4మి.మీ పొడవు, 54మి.మీ వెడల్పు ఉండే పీవీసీ కార్డుపై రేషన్ కార్డు వివరాలను పొందుపర్చనున్నారు. దీని ప్రకారం కొత్త రేషన్‌కార్డు ఏటీఎమ్ కార్డు సైజులో ఉండనుంది.
కొత్తగా అందించనున్న రేషన్ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. సైజు, కార్డుపై ముద్రించే వివరాల్లోనూ పౌరసరఫరాల శాఖ పలు మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం ఇచ్చిన టెండర్ నోటీసులో ఆ వివరాలను పేర్కొంది. కొత్త కార్డులపై కుటుంబ పెద్ద పేరు మినహా ఎవరి ఫొటోలనూ పెట్టడం లేదు. దీనిపై కుటుంబ పెద్ద పేరు, ఇతర వివరాలు ఉంటాయి. నకిలీ రేషన్ కార్డులకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు.
కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్, మరోవైపు కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి కోటి, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారికి 20లక్షల చొప్పున మొత్తం 1.20కోట్ల రేషన్ కార్డుల ముద్రణకు పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచింది. కార్డుల సరఫరా పూర్తయ్యే వరకు లేదా రెండేళ్ల పాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. కొత్త కార్డుల ముద్రణకు అయ్యే ఖర్చును పూర్తిగా తామే చెల్లిస్తామని టెండరు నోటీసులో పౌరసరఫరాల శాఖ తెలిపింది. బోగస్, నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకే క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు తెలిసింది.