తెలంగాణలో రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల వరకు మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని తెలిపింది. ఇందుకోసం రేషన్ కార్డును ప్రభుత్వం ప్రమాణికంగా తీసుకోనుంది. రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. పంట రుణమాఫీ సొమ్మును నేరుగా లబ్ధిదారుల రుణాలున్న బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఆరోహణ క్రమంలో (చిన్న విలువ నుంచి పెద్ద విలువ) రుణమాఫీ సొమ్మును విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో గల షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేదా రెన్యువల్ అయిన రుణాలకు, 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 09-12-2023 వరకు బకాయి ఉన్న అసలు, వడ్డీ మొత్తం రుణ మాఫీ పథకానికి అర్హత కలిగి ఉంటుంది. వ్యవసాయశాఖ కమిషనర్, సంచాలకులు పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేస్తారు. హైదరాబాద్‌లో గల నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎస్ఐఐసీ) ఈ పథకానికి భాగస్వామిగా ఉంటుంది.