Telangana: త్వరలోనే కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ
ఆరోగ్యశ్రీ సేవలను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 15 March 2024 1:21 PM GMTTelangana: త్వరలోనే కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ
ఆరోగ్యశ్రీ సేవలను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచింది. ఆరు గ్యారెంటీల్లో బాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొదట్లోనే ఈ హామీని అమలు చేసింది. అయితే.. రూ.10లక్షల వరకు వైద్యసాయం అందించేలా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాదు.. కొత్తగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులను కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధం అవుతోంది.
గతంలో ఆరోగ్యశ్రీ హెల్త్ బీమా రూ.5లక్షల వరకే ఉంది. దీన్ని తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10లక్షల వరకు పెంచింది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేసింది. వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ సమయంలో కార్డులను ఇచ్చారు. అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను ఇవ్వలేదు. దాంతో.. పలువురు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్డు పొందాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాల్సిందేనని కండీషన్ కూడా ఉంది. ఈ న్ కార్డులు లేకపోవడంతో చాలా మంది ఈ స్కీమ్‌కు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. వివాహాలు చేసుకోవడం.. విడిపోవడం సహా పలు కారణాల రీత్యా కూడా ఆరోగ్యశ్రీ ని కోల్పోతున్నారు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఈ స్కీమ్ అమలు విధానాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెల్లరేషన్ కార్డుతో సంబంధం లేకుండా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జారీచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితితో పాటు ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుని అర్హులను నియమించనున్నట్లు తెలుస్తోంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో కొత్త కార్డులను జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.