రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, బెట్టింగ్ యాప్స్‌ కేసులు సీఐడీకి బదిలీ

రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik
Published on : 24 April 2025 9:14 AM IST

Telangana Government, Betting Apps Promotions, Tollywood, Entertainment

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, బెట్టింగ్ యాప్స్‌ కేసులు సీఐడీకి బదిలీ

రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల విచారణను సీఐడీ (CID)కి బదిలీ చేయనుంది. ఇక సైబరాబాద్ , హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కేసులన్నీ ఇక సీఐడీ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. అయితే, బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వాహకుల్లో చాలా మంది విదేశీయులే ఉన్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. చైనాకు చెందిన కంపెనీలు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు రూ.వేల కోట్లను దేశం దాటించినట్లుగా తెలుస్తోంది. యాప్స్‌‌ను ప్రమోట్ చేసే సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లకు హవాలా మార్గాల్లో రెమ్యూనరేషన్‌ చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్స్ యాప్స్‌పై సమగ్ర విచారణను తెలంగాణ సర్కార్ అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీఐడీకి అప్పగించనుంది.

కాగా, బెట్టింగ్ యాప్స్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. మియాపూర్‌కు చెందిన ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెట్టింగ్స్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన టాలీవుడ్ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిపి మొత్తం 25 మందిపై మియాపూర్, పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నెం.393/2025 కింద 318 (4) 112, రెడ్ విత్ 49 బీఎన్ ఎస్ 3, 3(ఏ) 4, టీఎస్ జీఏ,66-డి ఐటీఏ 2000-2008 సెక్షన్లతో కేసులు బుక్ చేశారు. అదేవిధంగా విచారణకు రావాలంటూ నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు అందుకున్న వాళ్లలో దగ్గుబాటి రాణా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాత్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర రాజన్, వాసంతి కృష్ణన్, శోభశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహ పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషాయనీ సుప్రీత ఉన్నారు.

బెట్టింగ్‌ యాప్స్‌పై విచారణకు ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ (సిట్‌)‌ను ఏర్పాటు చేసింది. సీఐడీ చీఫ్‌ పర్యవేక్షణలో సిట్‌ పని చేసేలా డీజీపీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఐజీ ఎం.రమేశ్‌ నేతృత్వంలోని సిట్‌ బృందంలో ఇంటెలిజెన్స్‌ ఎస్పీ సింధు‌ శర్మ, సీఐడీ ఎస్పీ వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్‌, సీఐడీ డీఎస్పీ శంకర్‌ సభ్యులుగా ఉన్నారు. సిట్‌ భవిష్యత్‌ అవసరాల మేరకు ఈవోడబ్ల్యూ, న్యాయ, ఫోరెన్సిక్‌ నిపుణులు, ఇతర విభాగాల నుంచి సహాయ సహకారాలు పొందేలా ఉత్తర్వుల్లో వెసులుబాటు కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులను సిట్‌ విచారిస్తుంది. ప్రస్తుతం అమలవుతున్న చట్టాలను అమలు చేయించడం, బెట్టింగ్‌ యాప్స్‌ను నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి 3 నెలల్లో నివేదికను అందజేయనుంది.

Next Story