ఫార్ములా ఈ: ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు మెమో

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం మెమో జారీ చేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Jan 2024 6:55 AM GMT
Telangana government, IAS officer ,Arvind Kumar, Formula E race

ఫార్ములా ఈ: ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు మెమో 

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) శాఖ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ కోసం సరైన అనుమతులు లేకుండా రూ. 46 కోట్లు చెల్లించారని.. అందుకు వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి జనవరి 6, 2024న మెమో జారీ చేసారు. సచివాలయంలోని శాఖల నుంచి సరైన అనుమతులు లేకుండా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో, ఎందుకు డబ్బులు చెల్లించారో వివరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఒప్పందంలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని మెమోలో ప్రభుత్వం తెలిపింది. ఫార్ములా ఈతో త్రైపాక్షిక లాంగ్ ఫారమ్ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని అరవింద్ కుమార్‌ని ప్రభుత్వం కోరింది. అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఉన్నప్పుడే ఈ ఒప్పందాలు కుదిరాయని చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఎలాంటి అనుమతి లేకుండా నిధులు మంజూరు చేశారని మెమోలో పేర్కొన్నారు. అసలు ఆ నిధులు ఎందుకు మంజారు చేయాల్సి వచ్చిందో చెప్పాలని ప్రభుత్వం కోరింది.

MCC సమయంలో చర్యలు

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సమయంలో సీజన్-10 ఫార్ములా E ఈవెంట్ కోసం సవరించిన ఒప్పందాన్ని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? అని ప్రశ్నించింది.

బిజినెస్ రూల్స్ పాటించలేదు:

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ వనరుల నుంచి ఫార్ములా ఈకి రూ.46 కోట్లు, పన్ను కింద రూ.9 కోట్లు చెల్లించారు. “ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే, హెచ్‌ఎండీఏ డైరెక్టర్ల బోర్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ సమ్మతి పొందకుండానే మొత్తం చెల్లించారు.” అని లేఖలో ఉంది. (“Even before the agreement was signed, the amount was paid without obtaining the concurrence of HMDA’s Board of Directors as well as the Finance Department of the state government.”)

చట్టాలు ఏమి చెబుతున్నాయి:

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 299 ప్రకారం, యూనియన్ లేదా రాష్ట్రం కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించడంలో చేసిన ఒప్పందాలను రాష్ట్ర అధ్యక్షుడు లేదా గవర్నర్ చూస్తారు. ఫార్ములా E ఆర్థిక నిబద్ధతకు సంబంధించి ఒక ప్రధాన విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు, కాంపిటెంట్ అథారిటీ నుండి అధికారిక అనుమతి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న తలెత్తింది.

అరవింద్ కుమార్ ఇప్పటికే ఎంఏయూడీ శాఖ నుంచి తెలంగాణలో రెవెన్యూ శాఖకు బదిలీ అయ్యారు. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయన్ను ప్రభుత్వం ఆదేశించింది. పొరపాట్లు జరిగితే ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంటామని.. ఏ వివరణ జారీ చేయకపోతే అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొన్నారు.

రాజకీయ పరమైన మలుపులు తీసుకున్న ఫార్ములా ఈ:

జనవరి 5న ఫార్ములా E ని హైదరాబాద్ లో రద్దును కంపెనీ Xలో ప్రకటించింది. హైదరాబాద్‌లో ఈ రేసుకు సంబంధించిన 4వ రౌండ్ శనివారం, ఫిబ్రవరి 10, 2024న షెడ్యూల్ చేశారు. హైదరాబాద్ E-ప్రిక్స్ అధికారిక FIA ప్రపంచ ఛాంపియన్‌షిప్‌గా ఉండేది. హైదరాబాద్‌ బ్రాండ్‌కు ఈ రేసు పెద్ద పీట వేస్తోందని బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి కేటీ రామారావు ట్వీట్‌ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ సంస్థకు డబ్బు చెల్లించేలా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంది? ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా ఆ శాఖ ఎదురుచూడలేదు. వీటిలో చాలా లోపాలు ఉన్నాయి." అని తెలిపారు. "నగరం నడిబొడ్డున, ఫార్ములా ఈ రేసుల సమయంలో ప్రజలు ఏడు రోజుల పాటు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలను నగర శివార్లలో నిర్వహించాలి." అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాధాన్యతలకు అనుగుణంగా నడుస్తుందని ఆయన వివరణ ఇచ్చారు. రేసును అధికారికంగా రద్దు చేశామని.. ఆ శాఖలో లోపాలు ఉన్నాయని, చర్యలను తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది.

Next Story