నిరుద్యోగులకు శుభవార్త.. 10,945 జీపీవో పోస్టులకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌

గ్రామ పాలన అధికారి పోస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. 10,945 జీపీవో పోస్టులకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

By అంజి
Published on : 19 April 2025 7:54 AM IST

Telangana government, direct recruitment, GPO posts, Telangana

నిరుద్యోగులకు శుభవార్త.. 10,945 జీపీవో పోస్టులకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌

హైదరాబాద్‌: గ్రామ పాలన అధికారి పోస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. 10,945 జీపీవో పోస్టులకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జీపీవోల నియామకాన్నీ చేపట్టాలని యోచిస్తున్నది. దీని ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. కొత్తగా గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులను మంజూరు చేసింది. మొత్తం10,954 జీపీవో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. జీపీవో జాబ్​చార్ట్ కూడా ప్రకటించింది. మొదట వీఆర్‌ఏ, వీఆర్‌వోలలో అర్హులైన వారిని గుర్తించి తీసుకోవాలని భావించింది. ఈ మేరకు గ్రామ పాలన అధికారులుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారిని కలెక్టర్ల ద్వారా ఆప్షన్స్‌ తీసుకుంది.

మొత్తంగా 7 వేల మందికి అర్హతలు ఉన్నట్టు తెలిసింది. వీరికి ప్రవేశ పరీక్షలు నిర్వహించి, జీపీవోలుగా నియామించాలని ప్రభుత్వం భావించింది. అయితే కొత్త పోస్టుల కారణంగా తమ పాత సర్వీస్‌ కోల్పోతామని కొంతమంది కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో పాటు సర్దుబాటు చేసిన వారిని తీసుకుంటే కొత్త సమస్య వస్తుందని ఆలోచించి.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌తో పాటు పలు సర్దుబాట్లపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాకే జీపీవోల నియామకంపై ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించనుంది.

Next Story