'మరిన్ని పథకాలు'.. మహిళలకు భారీ శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

మహిళల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. వారి కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

By అంజి  Published on  24 Feb 2025 6:56 AM IST
Telangana government, schemes , women welfare, Telangana

'మరిన్ని పథకాలు'.. మహిళలకు భారీ శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం 

మహిళల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. వారి కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో వనిత ఘనత చాటేలా మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే స్త్రీ సంక్షేమ పథకాలపై చర్చించేందుకు మంత్రి సీతక్క నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో సభ్యులుగా ఐఏఎస్‌ అధికారులు అనితా రామచంద్రన్‌, శైలజారామయ్యర్‌, దివ్య దేవరాజన్‌ ఉన్నారు. ఈ కమిటీ డైరెక్షన్‌లోనే మహిళా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. జిల్లా కేంద్రాల్లో మహిళలకు పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ ఏజెన్సీలను ఇప్పించేందుకు వీలుగా ఆయిల్‌ కంపెనీలతో ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. స్వయం సహాయక బృందాలను ఒకే చోటుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అటు ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల పదవీ విరమణ ప్రయోజనాలను ప్రభుత్వం పెంచనుంది. అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, సహాయకులకు రూ.ఒక లక్ష చొప్పున ఇవ్వనుంది. అంగన్‌వాడీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులకు చీరలు, స్వయం సహాయక బృందాలకు వడ్డీ రాయితీ చెక్కులు ఇవ్వనుంది. తెలంగాణలోని మెయిన్‌ రైల్వే స్టేషన్లలో స్వయం సహాయక సంఘాల స్టాళ్లు ఏర్పాటు చేస్తారు.

Next Story