35 వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిందని, మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.
By అంజి Published on 27 Aug 2024 10:35 AM IST35 వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం
హైదరాబాద్: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిందని, మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం తెలిపారు. యువత ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వారికి నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేస్తోందన్నారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్కిల్స్ విశ్వవిద్యాలయానికి చైర్‌పర్సన్‌గా ఉండేందుకు సమ్మతించారు. దాని బోర్డులో ప్రఖ్యాత కార్పొరేట్‌లకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు.
ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో దేశ ప్రదర్శన ప్రజల అంచనాల కంటే తక్కువగా ఉందని, 2028 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేలా తెలంగాణ క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేస్తోందన్నారు. రాజీవ్ గాంధీ సివిల్ సర్వీసెస్ అభయ హస్తం కార్యక్రమం కింద సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిందని, అయితే పిల్లలను పౌల్ట్రీ ఫారాల కంటే అధ్వాన్నంగా ప్రైవేట్ భవనాల్లో ఉంచారని ఆరోపించారు. ఈ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5,000 కోట్లతో రాష్ట్రంలో 100 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను' ఏర్పాటు చేస్తోంది అని అన్నారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీలు బలహీనపడటానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని, మరో 10-15 రోజుల్లో అన్ని వర్సిటీలకు వీసీలను నియమిస్తామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం ఆచార్యులు, ఇతరత్రా ఖాళీలను భర్తీ చేస్తుందని చెప్పారు. విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ మైలేజీని పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు.
బీఆర్‌ఎస్ గత 10 సంవత్సరాల పాలనలో రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహించలేదు, కానీ ఇప్పుడు నిరుద్యోగం గురించి మాట్లాడుతోందని ఆయన అన్నారు. పోటీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ జరుగుతున్న నిరసనలను ప్రస్తావిస్తూ.. రాజకీయంగా తమకు అనుకూలం కాదని కొందరు పోటీ పరీక్షల నిర్వహణకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని అన్నారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు చెప్పేది వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారు ఎలాంటి నిరసనలకు దిగాల్సిన అవసరం లేదని అన్నారు. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు.