హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సర్కార్ ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేస్తోంది. రికార్డు స్థాయిలో ఈ వారం 23 వేల మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.261.51 కోట్లు చెల్లించినట్టు హౌసింగ్ ఎండీ గౌతమ్ తెలిపారు.
ఈ ప్రక్రియను ఆధార్ నంబర్ ఆధారిత చెల్లింపుల ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిని బట్టి ఈ నిధులను కేటాయించారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఎండీ గౌతమ్ మాట్లాడుతూ.. ఈ మార్చికల్లా లక్ష ఇళ్లను పూర్తి చేయడంతో పాటు తదుపరి దశను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్టు వెల్లించారు. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రూ.4,351 కోట్లకుపైగా నిధులు విడుదల చేశామన్నారు.
ప్రతి సోమవారం నాడు బిల్లుల విడుదల చేసే పద్ధతి కొనసాగుతుండటంతో రైతులు, పేద వర్గాల్లో ఈ పథకంపై నమ్మకం పెరుగుతోంది. మార్చి తర్వాత రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక ఇటీవలే ఇందిరమ్మ గృహాల రెండవ దశ ఏప్రిల్‌లో ప్రారంభమై దశలవారీగా కొనసాగుతుందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.