హైదరాబాద్: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు కేటాయించింది. మహిళా శక్తి క్యాంటీన్లతో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం 'ఇందిరా డెయిరీ ప్రాజెక్టు'ను తీసుకొచ్చింది.
మహిళా సాధికారత, ఆదాయం పెంపుదల, పాడి అభివృద్ధే ఉద్యేశ్యంగా ఇందిరా డెయిరీ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రెండు పాడి గేదెలు/ ఆవులు అందించనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ఖమ్మం జిల్లా మధిర నియోకవర్గంలో ప్రారంభించింది. కొడంగల్ సమా ఇతర ప్రాంతాలకూ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఒక్కో యూనిట్ ధర రూ.2 లక్షలు కాగా.. అందులో ప్రభుత్వం రూ.1.40లు సబ్సిడీ ఇస్తోంది. మిగతా రూ.60 వేలు బ్యాంక్‌లు లోన్ ఇస్తాయి. కాగా ఈ ప్రాజెక్టు కోసం 781.82 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే రూ. 286 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రూ.124.92 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతులు లభించాయి. మరో రూ.370 కోట్ల మేరకు నిధులు విడుదల కావాల్సి ఉంది. త్వరలోనే మిగతా నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.