హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 26 నుంచి సంవత్సరానికి ఎకరాకు రూ.12 వేలు పెట్టుబడి సాయం అందించనున్నట్టు పేర్కొంది. భూభారతి (గతంలో ధరణి)లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం అందనుంది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టదారులకూ ఈ మొత్తాన్ని అందించనున్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టదారులకూ ఈ పథకం వర్తిస్తుంది.
వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఫిర్యాదుల పరిష్కారానికి కలెక్టర్ బాధ్యులుగా ఉంటారని తెలిపింది. రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగు బాషలో జారీ చేసింది. యోగ్యమైన భూమి ఉన్న వారికి రైతు భరోసా పథకం అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న చెప్పిన విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ భూములకు మాత్రం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించదని స్పష్టం చేశారు.