రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం.. రేషన్, ఆధార్ కార్డ్ తప్పనిసరి
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది.
By అంజి Published on 22 Feb 2024 6:47 AM ISTరూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం.. రేషన్, ఆధార్ కార్డ్ తప్పనిసరి
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. అర్హులైనవారి గృహావసరాలకు మాత్రమే ఈ పథకం వర్తింప చేయనుంది. రేషన్‌కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇక రేషన్‌కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలుగా ఉంది. ఈ కుటుంబాలు గత మూడేళ్ల కాలంలో వినియోగించిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మరో ఏడు రోజుల్లో రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకాన్ని అమలు చేస్తామని సీఎం బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలో విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మొత్తం 1.20 కోట్ల కనెక్షన్లు ఉండగా.. అందులో 44 శాతం మంది ప్రతి నెలా ఒక సిలిండర్ వాడుతున్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు గుర్తించారు. రేషన్‌కార్డు ఉన్న వారికే ఈ పథకం వర్తింపచేస్తే ఈ శాతం మరింత తగ్గుతుంది. మూడేళ్ల సగటును పరిగణనలోకి తీసుకోవాలని కొద్దిరోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.955 కాగా కేంద్రం రూ.40 సబ్సిడీగా ఇస్తోంది. ఈ రాయితీ సొమ్ము సిలిండర్ తీసుకున్నాక.. బ్యాంకు ఖాతాల్లో పడుతోంది. ఇదిలా ఉంటే.. రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి ఆధార్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి సిలిండర్ కనెక్షన్ పాస్‌బుక్, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డును పరిశీలించి.. ఆ వివరాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తున్నారు.