హైదరాబాద్: వివిధ శాఖల ఆధ్వర్యంలోని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, ఇతర విద్యా సంస్థల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డైట్ చార్జీలను 3 నుంచి 7వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు రూ.950 నుంచి రూ.1330కు పెంచగా, 8 నుంచి 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1540కు పెంచింది. అలాగే ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్థినీ విద్యార్థులకు రూ.1500 నుంచి రూ.2100కు డైట్ ఛార్జీలను పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,65,700 మంది హాస్టల్ విద్యార్థులు ఉన్నారు.
కాస్మొటిక్ ఛార్జీలను సైతం ప్రభుత్వం పెంచింది. 3 నుంచి 7వ తరగతి విద్యార్థినులకు రూ.55 నుంచి రూ.175కు,8 నుంచి 10వ తరగతి విద్యార్థినులకు రూ.75 నుంచి రూ.275కు పెంచింది.
అలాగే 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.62 నుంచి 150కు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.62 నుంచి రూ.200కు పెంచింది.
అంతకుముందు డైట్ బిల్లులు, కాస్మోటిక్ ఛార్జీల విడుదల విషయమై బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం అధ్యక్షతన ఏర్పడిన ఉన్నతాధికారుల కమిటీని.. డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ చార్జీలను పెంచడం వల్ల రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లోని 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కమిటీ వివరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.