మహిళల కోసం తెలంగాణ సర్కార్ పలు పథకాలు అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహిళలను ఆర్థికంగా మరింతగా బలోపేతం చేసేందుకుగాను మహిళా శక్తి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు మహిళాశక్తి పథకం కింద పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు వాటిని నిర్వహించేందుకు వీలుగా బ్యాంకులు, స్త్రీనిధి, మండల మహిళా సమాఖ్య ద్వారా రుణం అందజేయనుంది.
జిల్లాల వారీగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఈ పథకంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టే పనులతో పాటు, క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాజాగా మీ సేవ కేంద్రాలను కూడా అప్పగించాలని నిర్ణయించింది. మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీలకు మాత్రమే పరిమితమైన మీ సేవ కేంద్రాలను గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పనున్నారు. ఈ మేరకు అర్హులైన వారి నుంచి ఐకేపీ కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.