ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
By అంజి Published on 24 Sept 2024 6:45 AM IST
ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా ఒకే కార్డు అందించాలని భావిస్తోంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ పొందుపరచడమే కాకుండా దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
డిజిటల్ హెల్త్ కార్డుల జారీ అంశంపై వైద్యారోగ్య, పౌర సరఫరాల శాఖ మంత్రులు, అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. కుటుంబాల్లో కొత్త సభ్యులు చేరినప్పుడు లేదా తొలగించాల్సి వచ్చినప్పుడు కార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకునేలా వ్యవస్థ ఉండాలని ఆదేశించడంతో పాటు పలు సూచనలు చేశారు.
కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని పైలెట్ ప్రాజెక్టు కింద కార్యాచరణ ప్రారంభించాలి.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని, ఈ కార్డులతో లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వ్యవస్థ మానిటరింగ్ కోసం జిల్లాల వారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.