అందుబాటులోకి 'మై మేడారం' యాప్
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది.
By అంజి Published on 19 Feb 2024 6:45 AM GMTఅందుబాటులోకి 'మై మేడారం' యాప్
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈనెల 18 నుంచి 24 వరకు జాతర నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం "మై మేడారం" యాప్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. నీరు, వైద్యం, పార్కింగ్, టాయిలెట్స్, స్నానాల ఘాట్‌లు, మిస్సింగ్ అలర్ట్స్, రిపోర్ట్ మిస్సింగ్, ఫైర్ ఇంజిన్ సేవలు, మిస్సింగ్ కేసులు దీనిలో ఉంటాయి. నెట్‌వర్క్ లేకపోయినా ఈ యాప్ సహాయంతో సేవలు పొందవచ్చు.
ఈ జాతరలో ముఖ్యమైన ఘట్టాలు చూసుకుంటే ఫిబ్రవరి 21న (మొదటి రోజు) పడిగిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెల వద్దకు తీసుకువస్తారు. పడిగిద్ద రాజును గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలతో మేడారానికి తీసుకువస్తారు. ఇక 22వ తేదీన (రెండవ రోజు) చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకువస్తారు. మూడవ రోజు ఫిబ్రవరి 23న ఉత్సవమూర్తులు అంతా గద్దలపై ఆ సమ్మక్క,సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లకు ముక్కులు సమర్పించుకుంటారు. నాలుగో రోజు ఫిబ్రవరి24వ తేదీన సాయంత్రం ఆ తల్లులు తిరిగి వన ప్రవేశం చేస్తారు. దీంతో ఈ జాతర ముగుస్తుంది.
ఇదిలా ఉంటే.. మేడారం జాతర సందర్భంగా నేటి నుంచి లక్నవరం సందర్శనను అధికారులు నిలిపివేశారు. ఈ నెల 19 నుంచి 26 వరకు లక్నవరంలో పర్యాటకులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మేడారం మహాజాతర భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పర్యాటకులు, సందర్శకులు అందరూ సహకరించాలని పోలీసులు కోరారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) రెండు వారాల క్రితం 6,000 బస్సులను మేడారం జాతర కోసం నడపనున్నట్టు తెలిపింది.