హైదరాబాద్: కరెంట్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం నో చెప్పింది. ఛార్జీల పెంపు ద్వారా ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ.1200 కోట్ల ఆదాయం పెంచుకుంటామని డిస్కంలు ప్రతిపాదించాయి. అయితే అందులో రూ.1170 కోట్లు భరిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే రూ.30 కోట్ల వరకూ మాత్రమే ఛార్జీల సవరణకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పర్మిషన్ ఇచ్చింది. ఛార్జీల పెంపు ప్రతిపాదనలను చాలా వరకూ తిరస్కరించినట్టు ఈఆర్‌సీ (విద్యుత్ నియంత్రణ మండలి) చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. ఈ సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ ఆర్డర్ ఉత్వర్వులను సోమవారం నాడు ఆయన విడుదల చేశారు.
గృహ వినియోగంలో నెలవారీ వినియోగ పరిమితి 800 యూనిట్లు దాటితేనే స్థిరఛార్జీ రూ.10 నుంచి రూ.50కి పెంచడానికి అనుమతి ఇచ్చామని తెలిపారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కరెంటు వినియోగించుకునేవారికి ఆఫ్ పీక్ లోడు కేటగిరీ కింద యూనిట్‌కు ప్రస్తుతం రూపాయి ఛార్జీ తగ్గిస్తుండగా.. వచ్చే నెల నుంచి రూపాయిన్నర తగ్గించనున్నట్టు తెలిపారు. కొత్తగా కొన్ని కేటగిరీల్లో పరిమితంగా పెంచిన ఛార్జీలను వచ్చే నెల 1 నుంచి 2025 మార్చి 31 వరకూ వసూల చేయనున్నారు. అలాగే చేనేత, కుటీర పరిశ్రమలకు తీసుకునే కరెంట్ కనెక్షన్ కనీస లోడు సామర్థ్యాన్ని 10 నుంచి 25 హెచ్‌పీకి పెంచామని, దీని వల్ల ఆధునాతన యంత్రాలను వాడుకునే చేనేత కాటేజ్ పరిశ్రమలకు కరెంట్ ఛార్జీల భారం తగ్గనుంది.