హైదరాబాద్: బడ్జెట్- 2025 - 26 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. 'ఇందిర గిరి జల వికాసం' పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు సౌర ఆధారిత పంపుసెట్ల ద్వారా సాగునీటి సరఫరా చేయనుంది. పోడు భూముల్లో అటవీ ఉత్పత్తలు, తోటల పెంపకానికి ప్రోత్సాహం అందివ్వనుంది. 2.1 లక్షల రైతులకు ఈ సౌకర్యం కల్పించనుంది. నాలుగేళ్లలో గిరిజనుల అభివృద్ధికి రూ.12,600 కోట్లు కేటాయిస్తామని పేర్కొంది. అటు బడ్జెట్‌లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు కేటాయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.
ఏడాదికి రూ.12 వేల చొప్పున అందిస్తామని చెప్పారు. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.24,439 కోట్లు కేటాయించింది. తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మార్చి 19, బుధవారం నాడు తెలంగాణ శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం రూ.3,04,965 కోట్లు, ఇది గత సంవత్సరం 2024-25 సంవత్సరానికి రూ.2,91,000 కోట్ల బడ్జెట్ కంటే గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది.