రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు: తెలంగాణ ప్రభుత్వం
సోమవారం(సెప్టెంబరు 2) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
By అంజి
రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు: తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలోనే సోమవారం(సెప్టెంబరు 2) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో అన్ని ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వం సెలవు రద్దు చేసింది. సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పలుచోట్ల రోడ్లపై భారీగా వరద ప్రవహిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ఉన్నచోట ఎవరూ రోడ్డు దాటేందుకు ప్రయత్నించవద్దన్నారు.
ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావొద్దని మంత్రి తెలిపారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు టేకాఫ్ తీసుకునే పరిస్థితి లేదని చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వారికి రక్షించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. చెరువులకు గండ్లు పడి గ్రామాల్లోకి వరద వస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి సూచించారు. వర్షం, వరదలో సెల్ఫీల కోసం యువత ప్రాణాలను పణంగా పెట్టొద్దని సూచించారు. అటు నేషనల్ హైవేలపై వరద ప్రవహిస్తోందని, చాలా ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగినట్టు చెప్పారు.