వారికి గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్..మరో 14 వేల మందికి పెన్షన్లు

HIV బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మానవీయంగా స్పందించింది.

By Knakam Karthik
Published on : 1 July 2025 1:56 PM IST

Telangana, HIV Patients, Telangana Government, Pensions

వారికి గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్..మరో 14 వేల మందికి పెన్షన్లు

HIV బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మానవీయంగా స్పందించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం 14,084 మంది కొత్త HIV బాధితులకు చేయూత పెన్షన్లు మంజూరు చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. ఈ పెన్షన్లు జూలై నెల నుంచి లబ్ధిదారులు అందుకోనున్నారు.

HIV బాధితులు పూర్తి స్థాయిలో ప‌ని చేయలేని స్థితిలో ఉండటంతో పాటు, వారిపై నెలనెలా అధిక వైద్య ఖర్చులు కూడా పడుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పేదరికంతో బాధపడుతున్న HIV బాధితుల జీవిత నాణ్యతను మెరుగుపరిచేందుకు చేయూత పథకం కింద ఈ సాయం అందించనున్నారు.

ఇప్పటికే 34,421 మందికి నెలకు రూ.2016 చొప్పున పెన్షన్ అందుతోంది. ఇందుకోసం రాష్ట్రం నెలవారీగా రూ.6.93 కోట్లు ఖర్చు చేస్తోంది. 2022 ఆగస్టు తరువాత HIV కేటగిరీలో కొత్తగా పెన్షన్లు మంజూరూ కాలేదు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TGSACS) ఆధ్వర్యంలో కొత్తగా నమోదు అయిన 14,084 మందికి అర్హతలు నిర్ధారించిన అనంతరం SERP ద్వారా పెన్షన్లు మంజూరు అయ్యాయి.

జిల్లాల వారీగా అర్హుల సంఖ్య:

హైదరాబాద్ – 3,019, నల్గొండ – 1,388, ఖమ్మం – 954, సూర్యాపేట – 931, కరీంనగర్ – 833, ఆదిలాబాద్ -482, భ‌ద్రాద్రి కొత్త‌గూడేం- 556, హ‌న్మ‌కొండ -825, జ‌గిత్యాల- 306, జ‌న‌గాం- 228, కామారెడ్డి -702, మ‌హ‌బూబ్ న‌గ‌ర్- 452, నిజామాబాద్- 528, పెద్ద ప‌ల్లి -567, సంగారెడ్డి -1242, సిద్దిపేట -527, వికారాబాద్- 544.

అయితే జయశంకర్ భూపాలపల్లి, గద్వాల్, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో కొత్తగా ఒక్కరు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

ఈ నూతన లబ్ధిదారులకు ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వ్యయం రూ.28.40 కోట్లు కాగా, కావాల్సిన నిధులు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్ప‌టికే 4020 మంది డ‌యాల‌సిస్ పేషెంట్ల‌కు ఈ మ‌ద్యే పించ‌న్ మంజూరు చేయ‌గా..తాజాగా HIV బాధితులకు పించ‌న్ మంజూరు చేయ‌డంతో ఈ వ‌ర్గాలు ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాయి.

Next Story