ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By - Knakam Karthik |
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్లు తప్పనిసరిగా 400-600 చదరపు అడుగల విస్తీర్ణంలో నిర్మించాలనే నిబంధనలున్నాయి. పలుచోట్ల నిర్ణీత విస్తీర్ణంలో ఇళ్లు కట్టడం లేదని అధికారులు అనుమతి రద్దు చేసిన ఉదంతాలూ ఉన్నయి. అయితే తక్కువ విస్తీర్ణం కారణంగా కొందరు ఇళ్లు మంజూరైనా నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు ఎక్కువగా నష్టపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
తక్కువ విస్తీర్ణంలో స్థలాలున్న లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని నిబంధనలను సడలించింది. 400 చదరపు అడుగులు 44.4 చదరపు గజాలలోపు స్థలం ఉన్నా, జీ ప్లస్ వన్ విధానంలో ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించింది. ఫలితంగా నిర్ణీత స్థలం కన్నా తక్కువ ఉన్న లబ్ధిదారులకు ఊరట కలగనుంది. నిర్ణీత విస్తీర్ణం లేని లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు జీప్లస్ విధానంలో చేపట్టాలనుకుంటే ముందుగానే గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఈఈ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఇంటిని తప్పనిసరిగా ఆర్సీసీ ఫ్రేంలోనే నిర్మించాలి. ఇంటి నిర్మాణంలో తప్పనిసరిగా వంట గది, మరుగుదొడ్డి ఉండాలని నిబంధనలు విధించింది. గ్రౌండ్ ఫ్లోర్‌కు రూ.లక్ష, రూఫ్ లెవెల్‌కు రూ.లక్ష, మొదటి అంతస్తుకు రూ.2 లక్షలు, మొత్తం ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత రూ.లక్ష చొప్పున బిల్లులు చెల్లించనున్నారు.