హైదరాబాద్: సీఎం రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేసే చిరు ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. వీరికి మే నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి నెలనెలా జీతాలు అందనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఫైల్‌కు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో వీరికి ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి నెలా వీరి జీతాల కోసం రూ.115 కోట్లు కేటాయించనున్నారు. ఇకపై వారికి నెలనెలా వేతనాలు అందేలా ప్రత్యేక పోర్టల్ రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 92 వేల మందికి ప్రయోజనం కలగనుంది. ఈ పద్ధతి ద్వారా పారిశుద్ధ్య కార్మికులు, బిల్ కలెక్టర్లు, ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, సెర్ప్‌లో ఉద్యోగులకు తమ జీతాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే వీరికి నెల ప్రారంభంలో జీతాలు అందనున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీసుకున్న చొరవతో ఈ చిరుద్యోగుల్లో వెలుగులు నిండనున్నాయి. ప్రతి నెల 25వ తేదీ వరకు ఉద్యోగుల హాజరు వివరాలను సేకరించి.. 26వ తేదీన వేతనాల బిల్లును రూపొందించి.. మే నెల నుండి ప్రతి నెల ఒకటో తేదీన నేరుగా వారి ఖాతాల్లో జీతాలు జమ చేయనున్నారు.