హైదరాబాద్: ఈ నెల 26 నుంచి ప్రభుత్వం రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఇందుకోసం రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సాగుకు యోగ్యం కాని భూములపై సర్వే చేసి 10 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దీని ప్రకారం వ్యవసాయం చేసే భూములకే డబ్బులు అందనున్నాయి. ఈ పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.12 వేలు అందుతాయి. వ్యవసాయ భూములకే రైతు భరోసా ఇస్తామని ప్రకటించి ప్రభుత్వం.. సాగు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు జాయింట్ సర్వే నిర్వహించనుంది.
వ్యవసాయ, పంచాయతీ రాజ్, రెవెన్యూ ఆధ్వర్యంలో ఫీల్డ్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్టు సమాచారం. సర్వే నంబర్ల వారీగా గుట్టలు, రోడ్ల నిర్మాణంలో కోల్పోయిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన భూములు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూముల లిస్ట్ రెడీ చేయనున్నట్టు తెలుస్తోంది. వర్షాకాలం సాగు లెక్కలను ప్రామాణికంగా తీసుకుని పథకానికి కావాల్సిన నిధులను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తు అవసరం లేకుండానే రైతు భరోసా చెల్లించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.