రాష్ట్రంలో లోకల్ ఎలక్షన్స్‌కు MPTC, ZPTC స్థానాలు ఖరారు

తెలంగాణలో లోకల్ ఎలక్షన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రెడీ అవుతోంది.

By Knakam Karthik
Published on : 17 July 2025 9:00 AM IST

Telangana, Local Body Elections , Zptc And Mptc Seats

రాష్ట్రంలో లోకల్ ఎలక్షన్స్‌కు MPTC, ZPTC స్థానాలు ఖరారు

తెలంగాణలో లోకల్ ఎలక్షన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓ వైపు పంచాయతీల రిజర్వేషన్‌ల ఖరారుకు హైకోర్టు పెట్టిన గడువు సమీపిస్తుండగా, మరోవైపు పంచాయతీ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఇంకా నిర్ణయం తేసుకోలేదు. రాజ్‌భవన్ నిర్ణయం వెలువడిన తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి, ఎస్‌ఈసీకి సమర్పించాలని ప్రభుత్వం ఎదురు చూస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్రంలో జిల్లా పరిషత్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఘట్టం పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల 773 ఎంపీటీసీ స్థానాలు, 566 జడ్పీటీసీలు, 31 జిల్లా పరిషత్‌లు, 12 వేల 778 పంచాయతీలు, లక్షా 12 వేల వార్డులను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 353, అతి తక్కువగా ములుగులో 83 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 71 పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో పాటు కొత్త మండలాల ఏర్పాటుతో పంచాయతీరాజ్ శాఖ పునర్వ్యవస్థీకరించి ఖరారు చేసింది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు వీలుగా పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరిస్తూ ఇటీవల ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్‌కు ప్రభుత్వం పంపించింది. గవర్నర్ నిర్ణయం కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. బీసీలకు 42 శాతం కేటాయించేలా డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్ల ముసాయిదా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే రిజర్వేషన్లు ప్రకటించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మరోవైపు పంచాయతీలు, వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తోంది.

Next Story