హైదరాబాద్ మెట్రో ఎండీ పదవీకాలంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ మెట్రో ఎండీ పదవీకాలంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik
హైదరాబాద్ మెట్రో ఎండీ పదవీకాలంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ మెట్రో ఎండీ పదవీకాలంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ ఎండీగా ఎన్వీఎస్ రెడ్డికి తిరిగి అదే స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకాలం హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్), హెదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీగా కీలకంగా వ్యవహరించిన ఎన్వీఎస్ రెడ్డి సేవలను మరికొంత కాలం కొనసాగించడం సముచితం అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు మరో ఏడాది పాటు ఎన్వీఎస్ రెడ్డిని హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఏఎంఎల్ ఎండీగా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కాగా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో సెకండ్ ఫేజ్ ను కీలకంగా భావిస్తోంది. ఓల్డ్ సిటీ, ఎయిర్ పోర్టు, ఫోర్త్ సిటీ, నార్త్ సిటీ వంటి ప్రాంతాలకు సైతం మెట్రో నడిపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పార్ట్ -ఏ కింద 5 కారిడార్లు, పార్ట్ -బీ కింద 3 కారిడార్లను ప్రతిపాదించగా ఇందులో పార్ట్-ఏ లోని 5 కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ఎను 5 నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి పంచింది. ఈ డీపీఆర్ కు అనుమతులు వస్తే పనులను వేగంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో మొదటి నుంచి కీలకంగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డి సేవలు తప్పనిసరి అని ప్రభుత్వం భావించింది.