తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మరో సరికొత్త పథకం అమలుకు సిద్ధం అవుతోంది. పొదుపు సంఘాల మహిళల ఆర్థిక స్వాలంబన కోసం కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తోంది. వారికి తక్కువ ఖర్చుతో కూడిన పర్యావరణహితంగా ఉండే ఎలక్ట్రిక్ ఆటోలను అందించాలని ఈ మేరకు భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా జనగామ జిల్లా పాలనాధికారి రిజ్వాన్ బాషా చొరవతో ఈ కార్యక్రమాన్ని తొలుత పాలకుర్తిలో ప్రారంభించాలని సంకల్పించారని డీఆర్డీవో తెలిపారు. పాలకుర్తి సోమేశ్వరాలయం, సోమనాథుని స్మృతివనం, వల్మిడి రామాలయం, బమ్మెర పోతన జన్మస్థలం, పంచగుళ్లు తదితర ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు వీటిని అందుబాటులో ఉంచనున్నారు.
ఇక బుధవారం జనగామ జిల్లాలోని పాలకుర్తిలో ఓ మహిళకు ఎలక్ట్రిక్ ఆటోను అందించారు. ప్రయోగాత్మకంగా ఒక ఆటోను నడపనున్నారు. పొదుపులో ఉన్న సభ్యురాలు లేదా వారి కుటుంబంలో లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఈ వాహనాన్ని అందిస్తారు. స్త్రీనిధి రుణం నుంచి ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఈ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ ఆటోలకు చార్జింగ్ పాయింట్ల కోసం అధ్యయనాలు చేస్తున్నారు. వాహనాలకు ఛార్జింగ్ పాయింట్లు పెట్టే ప్రదేశాలను పరిశీలిస్తున్నామని డీఆర్డీవో తెలిపారు.