ఈ నెల 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

By Srikanth Gundamalla  Published on  20 July 2024 10:48 AM GMT
telangana, government, assembly, budget,  july 25th.

ఈ నెల 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-2025 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. వాస్తవిక అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక శాఖను ఆదేశించింది. 25న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయ్యి ప్రతిపాదనలపై చర్చించి బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది.

ఈ నెల 23 నుంచి ప్రారంభం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచరంతో సమాధానాలు పంపాలని ఆమె అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సెషన్‌లో సమన్వయ లోపం గ్యాప్ లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎస్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 25న ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు తెలిపారు. మరోవైపు మండ‌లి స‌మావేశాలు 24వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సెక్ర‌ట‌రీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం, రుణాల సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్‌ రూ.2.50 లక్షల కోట్ల వరకు చేరే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈనెల 23న పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నందున వెంటనే రాష్ట్ర బడ్జెట్‌కు నిధుల కేటాయింపుపై తుదిరూపు ఇవ్వనున్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించే రుణాలు కలిపి రూ.60 వేల కోట్లకు పైగానే ఉండవచ్చని ప్రాథమిక అంచనా.

Next Story