Hyderabad: పేలుడు ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం, నిపుణులతో కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాద విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik
Hyderabad: పేలుడు ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం, నిపుణులతో కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాద విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన భారీ పేలుడుకు దారితీసిన కారణాలను గుర్తించడానికి, సంఘటనలను పరిశీలించడానికి CSIR-IICT నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రమాదానికి కారాణాలు తెలుసుకొని భవిష్యత్‌లో ఇలాంటివి నివారించే ఉద్దేశంతో ఈ కమిటీ కీలక సూచనలు చేయనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి చైర్మన్ గా డాక్టర్ బి. వెంకటేశ్వరరావు ఉంటారు. డా.టి. ప్రతాప్ కుమార్, డా. సూర్య నారాయణ, డా.సంతోష్ గుగే సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దుర్ఘటనపై విచారణ చేసి బాధితులతో మాట్లాడి నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
పేలుడులో 40 మందికి పైగా మృతి
ఈ విషాద సంఘటన జూన్ 30న ఉదయం 9:20 గంటల ప్రాంతంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని ఐడిఎ ఫేజ్-Iలోని ప్లాట్ నెం. 20 మరియు 21 వద్ద ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో జరిగింది. ఈ కర్మాగారం ఫార్మాస్యూటికల్ టాబ్లెట్లు, క్యాప్సూల్స్‌లో బైండింగ్ ఏజెంట్‌గా ఉపయోగించే మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్‌ను తయారు చేస్తుంది. పేలుడు జరిగిన సమయంలో, ఆవరణలో 143 మంది కార్మికులు ఉన్నారు. ఈ పేలుడు కారణంగా 40 మందికి పైగా మరణించగా, అనేక మంది గాయపడ్డారు.