పామాయిల్ ఫ్యాక్టరీ, బాటిల్‌ క్యాప్‌ యూనిట్‌.. యూనిలీవర్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో మరో దిగ్గజ కంపెనీ యూనిలీవర్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

By అంజి  Published on  22 Jan 2025 9:30 AM IST
Telangana government, Unilever company, Davos, CM Revanth reddy

పామాయిల్ ఫ్యాక్టరీ, బాటిల్‌ క్యాప్‌ యూనిట్‌.. యూనిలీవర్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో మరో దిగ్గజ కంపెనీ యూనిలీవర్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కామారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ ఉత్పత్తి (రిఫైనింగ్) కేంద్రం, మరో ప్రాంతంలో బాటిల్ క్యాప్‌లను తయారు చేసే యూనిట్‌ను నెలకొల్పడానికి యూనిలీవర్ ఒప్పందం చేసుకుంది. ఎఫ్ఎంసీజీ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన యునిలీవర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ హెయిన్ షూమాకర్, చీఫ్ సప్లయి చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌ తో ముఖ్యమంత్రి , పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు జరిపిన చర్చల అనంతరం ఈ మేరకు ఒప్పందం కుదిరింది.

దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ వ్యూహాత్మక కేంద్రంగా ఉంటుందని, విస్తృత మార్కెట్‌కు మిగతా రాష్ట్రాలకు ఈ ప్రాంతం ముఖద్వారంగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న సానుకూల పరిస్థితులను వారికి వివరించారు. దేశంలో యూనిలీవర్‌కు పలుచోట్ల కేంద్రాలు ఉన్నప్పటికీ తెలంగాణలో విస్తరించలేదని, వినియోగ వస్తువులకు రాష్ట్రంలో భారీ మార్కెట్ ఉందని, ఇక్కడి సులభతర వ్యాపార విధానాలు తయారీ సంస్థలకు అదనపు బలంగా ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారు.

యూనిలీవర్‌ సీఈవో షూమాకర్ గారు మాట్లాడుతూ.. తెలంగాణలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే, బాటిల్ క్యాప్‌లను ఉత్పత్తి చేయడానికి కొత్త తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని చర్చల సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం యూనిలీవర్ సంస్థ తమ ఉత్పత్తుల బాటిల్ క్యాప్‌లను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే బాటిల్ క్యాప్ యూనిట్‌ను నెలకొల్పడం ద్వారా వాటి కొరతను అధిగమించవచ్చు. రాష్ట్రంలో యూనిలీవర్ విస్తరణకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తామని, పామాయిల్ యూనిట్ ఏర్పాటుకు కామారెడ్డి జిల్లాలో అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.

Next Story