అకాల వర్షం పంట నష్టానికి ఎకరాకు రూ.15వేలు: మంత్రి జూపల్లి
పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో జామ, మామిడితో పాటు ఇతర పంటల రైతులు నష్టపోయారు.
By Srikanth Gundamalla Published on 21 March 2024 4:31 PM ISTఅకాల వర్షం పంట నష్టానికి ఎకరాకు రూ.15వేలు: మంత్రి జూపల్లి
తెలంగాణలో గత మూడ్రోజులుగా వాతావరణం చల్లబడింది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడ్డాయి. ఫిబ్రవరి చివరి రోజుల నుంచి ఇప్పటి వరకు ఎండలతో సతమతం అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లు అయ్యింది. ఉక్కపోత నుంచి కొంచెం రిలీఫ్ దొరికింది. అయితే.. ఈ అకాల వర్షంతో రైతులకు మాత్రం నష్టమే మిగిలింది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో జామ, మామిడితో పాటు ఇతర పంటల రైతులు నష్టపోయారు. వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వర్షం కారణంగా పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు పరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నష్టపోయిన ప్రతి రైతుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి చెప్పారు.
మరోవైపు రైతుభరోసా డబ్బుల జమ గురించి కూడా ఆయన స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటికే 58.6 లక్షల రైతులకు రైతుభరోసా సొమ్ము అందిందని చెప్పారు. ఇక వచ్చే వారం రోజుల్లో మిగిలిన రైతులకు కూడా రైతుభరోసా నిధులు అందుతాయని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారనీ.. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి అప్పులపాలు చేవారని ఆరోపించారు.