హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ప్రకటించింది. ఉచిత శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్‌ను www.tgbcstudycircle.cgg.gov.inలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రం (టీజీ బీసీఈఎస్‌డీటీసీ) డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఉచిత శిక్షణకు ఎంపికైన వారికి శిక్షణా కాలంలో నెలకు రూ.5000 ఉపకార వేతనం అందజేస్తారు. గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణ హైదరాబాద్ సైదాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ (రోడ్ నెం: 8, లక్ష్మీనగర్), ఖమ్మంలోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో అందజేస్తారు.
మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ 040-24071188 నెంబర్ సంప్రదించవచ్చు. తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మెయిన్స్కు 1:50 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. మరోవైపు ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి.