గోదావరి ఉగ్రరూపం, మూడో ప్రమాద హెచ్చరిక దిశగా ప్రవాహం
దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 23 July 2024 8:30 AM ISTగోదావరి ఉగ్రరూపం, మూడో ప్రమాద హెచ్చరిక దిశగా ప్రవాహం
దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణకు వరద పోటెత్తుతోంది. ముఖ్యంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే దిశగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి నది 51.10 అడుగల వద్ద 13,18,860 క్యూసెక్కుల వరదతో ప్రవహిస్తోంది. 53 అడుగులు దాటగానే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
గోదావరిలో నదిలో వరద ప్రవాహం ఎక్కువైన నేపథ్యంలో అధికారులు సోమవారమే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద అర్ధరాత్రి వరకు 50.6 అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం. గోదావరి వరద ఉదృతితో దేవస్థానానికి సంబంధించిన స్నానఘట్టాల వద్ద ఉన్న కల్యాణకట్ట కింది భాగం పూర్తిగా మునిగిపోయింది. ముంపు బారిన పడే అవకాశం ఉందన్న అంచనాతో 111 గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం చేసింది. తుది ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే.. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని పలు గ్రామాల్లోకి నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు మేడిగడ్డ వద్ద ఏకంగా 9 మీటర్ల ఎత్తున ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలానికి వరద పోటెత్తింది. జూరాలతో పాటు తుంగభద్ర నుంచి కూడా నీటిని అధికారులు విడుదల చేశారు. దాంతో.. శ్రీశైలానికి వరద నీరు వచ్చి చేరుతోంది. రాష్ట్రంలో కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టినా.. ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వరదల కారణంగా రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. కొన్ని వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. రాబోయే మూడ్రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు అధికారులు కూడా అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే వరద ముంచెత్తుండటం.. మరో వైపు భారీ వర్ష సూచనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.