శాసనసభలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
Telangana Formation Day celebrations in Assembly.తెలంగాణ రాష్ట్రం అవతరించి నేటితో ఎనిదేళ్లు పూర్తి అయ్యాయి. 2014లో
By తోట వంశీ కుమార్ Published on 2 Jun 2022 2:48 AM GMTతెలంగాణ రాష్ట్రం అవతరించి నేటితో ఎనిదేళ్లు పూర్తి అయ్యాయి. 2014లో జూన్ 2న తెలంగాణ అవతరించింది. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం.. ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ప్రస్తుతం కరోనా అదుపులో ఉండగా, కొవిడ్ ఆంక్షలు తొలగిపోవడంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఇందులో భాగంగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శాసనసభలో ఘనంగా జరిగాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అటు శాసన మండలి ప్రాంగణంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్,నవీన్ కుమార్, ఎల్ రమణ, దండే విఠల్, శేరి శుభాష్ రెడ్డి, రఘోత్తము రెడ్డి, లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు, టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 9 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత ఎనిమిదేళ్ల తెలంగాణ ప్రస్థానంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ వివరించనున్నారు. పబ్లిక్ గార్డెన్స్ కు వెళ్లడానికి ముందు సీఎం కేసీఆర్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నారు. అదేవిధంగా రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాజ్ భవన్ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ జరిగే ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొంటారు.