ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. రాష్ట్ర గీతాన్ని విడుదల చేసిన సీఎం
తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
By Srikanth Gundamalla Published on 2 Jun 2024 12:00 PM ISTఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. రాష్ట్ర గీతాన్ని విడుదల చేసిన సీఎం
తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలను గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌కు అక్కడ సీఎస్, డీజీపీ, అధికారులు స్వాగతం పలికారు. పరేడ్ గ్రౌండ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయ హే తెలంగాణ'ను సీఎం రేవంత్‌రెడ్డి ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీ ముఖ్యనేతలు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకమన్నారు రేవంత్‌రెడ్డి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను నెరవేర్చిన మన్మోహన్ సింగ్, సోనియాగాంధీలకు సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ నైజమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్వేచ్ఛను ఎవరు హరించినా తెలంగాణ సమాజం సహించదని చెప్పారు. పాలకుడు, ప్రజల మధ్య గొడలను బద్దలు కొట్టామన్నారు. ప్రగతిభవన్ పూలే భవన్‌గా ప్రజల్లోకి తెచ్చామన్నారు. సచివాలయంలోకి సమాన్యుడికి వచ్చేందుకు అవకావం కల్పించామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ కొద్దికాలం పాలనలో ఎక్కడైనా తప్పులు జరిగితే.. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుతాం అని సీఎం రేవంత్ అన్నారు. సర్వజ్ఞాస్నులుగా తాము భావించము అనీ.. అందరి సూచనలు తీసుకుంటామని చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగిందంటూ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. రాష్ట్ర సంపద గుప్పెడు మందికే చేరిందన్నారు. అయితే.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించామనీ చెప్పారు. దీనిపైనా విమర్శలు చేయడం దారుణమన్నారు. సోనియాగాంధీని ఏ హోదాలో తెలంగాణకు ఆహ్వానిస్తున్నారని అనడం దురదృష్టమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి ఆహ్వానం కావాలా? అని ప్రశ్నించారు. సోనియాగాంధీకి తెలంగాణతో పేగు సంబంధం అన్నారు. ఇక జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. అలాగే కొత్త అధికారిక లోగోను రూపొందిస్తున్నామనీ.. అందరి సూచనల తర్వాత ప్రకటిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.