తెలంగాణ అటవీశాఖ అధికారి హత్య.. 'పోడు' భూముల సమస్య మరింత జఠిలం
Telangana forest officer's lynching further complicates 'podu' land issue. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల అటవీశాఖ అధికారిని గుత్తికోయ గిరిజనులు
By అంజి Published on 27 Nov 2022 12:03 PM ISTతెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల అటవీశాఖ అధికారిని గుత్తికోయ గిరిజనులు కొట్టి చంపిన ఘటన అటవీశాఖాధికారులు, గిరిజనుల మధ్య వివాదానికి కారణమైన పోడు భూముల సమస్యను మరింత జఠిలం చేసేలా కనిపిస్తోంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ) శ్రీనివాసరావు దారుణ హత్యతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే పోడు భూములపై హక్కులు పొందే వారి పట్ల ప్రభుత్వం మెతక వైఖరిని ప్రదర్శించేందుకు యత్నిస్తుండగా అటవీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు.
పోడు భూములను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టి గిరిజనులు, గిరిజనేతరుల నుంచి వచ్చిన 4 లక్షలకు పైగా క్లెయిమ్‌ల పరిష్కారానికి గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న తరుణంలో ఎఫ్‌ఆర్‌వో హత్యకు గురయ్యారు. అటవీశాఖాధికారి హత్యకు నిరసనగా అటవీశాఖాధికారులు సర్వే పనులను బహిష్కరించడం, అడవుల్లోకి వెళ్లే సమయంలో ఆయుధాలు కావాలని నినాదాలు చేయడం.. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వ ఇబ్బందులను మరింత పెంచే అవకాశం ఉంది.
ఇటు అధికారులు, అటు పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల మధ్య టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిక్కుకుపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. పోడు అనేది గిరిజన, గిరిజనేతర అటవీ నివాసులు.. అటవీ భూమిలో పంటలు సాగు చేసుకునే పద్ధతి. వారు ఒక సీజన్‌లో కొంత భూమిలో పంటలను పండిస్తారు. తదుపరి సీజన్‌లో వేరే ప్రదేశానికి వెళ్తారు. అయితే.. ఈ పద్ధతి అటవీ భూమి ఆక్రమణకు దారితీసింది. ఇటీవలి కాలంలో హరితహారాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'హరితహారం' కార్యక్రమం కింద తోటల పెంపకం చేపట్టిన పోడు సాగుదారులు, అటవీశాఖాధికారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
గిరిజనులు, ఇతర అటవీ నివాసులు పోడు భూముల్లో చెట్ల పెంపకం వారి హక్కులను ఉల్లంఘిస్తుందని పేర్కొంటున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను ఒక్కసారిగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములపై అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు గతేడాది కసరత్తు చేపట్టింది. సమస్య సద్దుమణిగిన తర్వాత అంగుళం అటవీ భూమిని కూడా ఆక్రమణకు అనుమతించబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు.
అటవీప్రాంతంలో పోడు సాగులో నిమగ్నమైన గిరిజనులకు సాగు కోసం సమీపంలోని ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూమిని అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేని పక్షంలో అటవీభూమి బయటి అంచున వారికి భూమిని అందించాలి. వారికి ఉచితంగా నీరు, విద్యుత్, ఇళ్లు కూడా అందజేస్తామని చెప్పారు. క్లెయిమ్‌లను స్వీకరించడానికి ROFR చట్టం ప్రకారం గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. RoFR చట్టం కింద 'పట్టాలు' (టైటిల్‌లు) జారీ కోసం 2,845 గ్రామ పంచాయతీల్లో 4.14 లక్షల క్లెయిమ్‌లను ప్రభుత్వం స్వీకరించింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకారం, దరఖాస్తుదారులలో 68 శాతం మంది గిరిజనులు, మిగిలిన 32 శాతం మంది గిరిజనేతరులు.
గిరిజన, గిరిజనేతర రైతులు 12.49 లక్షల ఎకరాల అటవీ భూములకు క్లెయిమ్‌లు చేశారు. భూములను గుర్తించేందుకు సర్వే చేపట్టారు. క్లెయిమ్‌ల పరిష్కారానికి అటవీశాఖ అధికారులతో సహా గ్రామస్థాయి కమిటీలు 'గ్రామసభలు' నిర్వహించాలని కోరారు. అయితే, ఇలాంటి కసరత్తు చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. 6.90 లక్షల ఎకరాల అటవీ భూమిపై హక్కులు కల్పించాలని కోరుతూ గతంలో 2.04 లక్షల క్లెయిమ్‌లు దాఖలయ్యాయి. గిరిజన సంక్షేమ శాఖ 96,676 క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసింది. 3.08 లక్షల ఎకరాల అటవీ భూమిపై వ్యవసాయ హక్కులను ఆమోదించింది. పోడు హక్కుల కోసం 3.27 లక్షల ఎకరాలకు సంబంధించిన 91,942 క్లెయిమ్‌లు ఆమోదం పొందలేదని అధికారులు తెలిపారు.
దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీలను అటవీశాఖ తరిమికొడుతుందని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. అటవీశాఖ అధికారులు ఏటా వారి భూములను లాక్కుంటున్నారనే ఆరోపణలున్నాయి. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం అటవీ భూముల్లో మొక్కలు నాటుతున్నామని వాదిస్తున్నారు. అటవీశాఖ అధికారుల ప్రకారం.. డిసెంబర్ 2005 కంటే ముందు సాగులో ఉన్న భూములకు మాత్రమే RoFR చట్టం వర్తిస్తుంది.
ఏజెన్సీ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల గత రెండేళ్లుగా ఘర్షణలు జరిగాయి. పోడు భూములపై హక్కులు ఉన్న గిరిజనులు మొక్కలు నాటేందుకు అక్కడికి వెళ్లిన అటవీశాఖ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల అటవీశాఖ అధికారి శ్రీనివాసరావును గుత్తి కోయ తెగకు చెందిన కొందరు వ్యక్తులు నరికి చంపారు. స్థానిక ప్రజాప్రతినిధులు తమ హక్కుల కోసం మాట్లాడాలని, పోడు భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోకుండా అడ్డుకోవాలని గిరిజనులు ఒత్తిడి తెస్తున్నారు.
2020లో అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ గిరిజన శాసనసభ్యుడు దీన్ని తారా స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఖమ్మం జిల్లాలోని పినపాక అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రేగా కాంతారావు.. అటవీశాఖ అధికారులను తమ గ్రామాల్లోకి రానివ్వవద్దన్నారు. పోడు భూముల్లో మొక్కలు నాటుతున్న అటవీ సిబ్బందిని తరిమికొట్టాలని, పోడు భూముల్లో నాటిన మొక్కలను హరితహారం కింద పెకిలించాలని ఆదిలాబాద్‌కు చెందిన బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఆదివాసీలను కోరారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సాగుదారులు, ప్రత్యేకించి గిరిజనులు అధికార పార్టీకి ఎదురుతిరగకుండా ఉండేందుకు వీలుగా క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సొంత శాసనసభ్యుల నుంచి ఒత్తిడి వస్తోంది. అటవీశాఖ అధికారిని కొట్టి చంపడం ప్రభుత్వ ఆందోళనను మరింత పెంచింది. ఆదివాసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా అటవీశాఖాధికారులను ప్రభుత్వం అసంతృప్తికి గురిచేయలేదని విశ్లేషకులు అంటున్నారు.
తాజా పరిణామాలు టీఆర్‌ఎస్‌పై దాడికి దిగేందుకు ప్రతిపక్షాలకు మందుగుండును అందించాయి. ఎఫ్ ఆర్ ఓ హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో ఆయన అసమర్థత వల్లే అధికారి హత్యకు గురయ్యారని, దీని పూర్తి బాధ్యత కేసీఆర్‌దే అని బీజేపీ నేత బండి సంజయ్.. ఆయనపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
పోడు భూములకు పట్టాలు మంజూరు చేస్తామని, అవసరమైతే ప్రతి గ్రామంలో అధికారులతో సమావేశమై సమస్యను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా చెప్పారని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు సంజయ్ గుర్తు చేశారు. గిరిజనులు పోడు భూమిని సాగు చేసుకోవచ్చని ఒకవైపు ముఖ్యమంత్రి చెబుతూనే మరోవైపు రైతులు తాము వేసిన పంటలు పండించుకుంటున్న సమయంలో అడవుల్లో దాడులు చేసేందుకు అటవీ అధికారులను పంపిస్తున్నారని బీజేపీ నేత ఆరోపించారు.
అర్హులైన గిరిజనులకు పోడు భూముల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందడంతో అటవీశాఖ అధికారులకు, గిరిజనులకు మధ్య తరచూ వాగ్వాదం జరుగుతోందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పోడు భూముల పట్టాలు జారీ చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే విపక్షాల ఆరోపణలను అటవీ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి తోసిపుచ్చారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలు ఈ సమస్య నుండి రాజకీయ మైలేజీని పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు.