హోలీ పండుగ సందర్భంగా ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా తెలంగాణ ఆహార భద్రతా విభాగం రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. మార్చి 2 నుండి 4 వరకు నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా అధికారులు మొత్తం 140 దుకాణాలను తనిఖీ చేసి, స్వీట్లు, స్నాక్స్ మరియు పాల ఉత్పత్తులకు సంబంధించి 221 నమూనాలను సేకరించారు.
ఈ తనిఖీల్లో సురక్షితం కాని ఆహార పదార్థాలను 12 సందర్భాలలో పారవేయగా, మరో 8 చోట్ల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ప్రారంభించిన అధికారులు, పండుగ వేళ కల్తీ లేని ఆహారం అందించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.