Telangana: రైతు రుణమాఫీ అందలేదా? ఇక నేరుగా ఇంటికే..
తెలంగాణలో ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసింది.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 4:00 AM GMTTelangana: రైతు రుణమాఫీ అందలేదా? ఇక నేరుగా ఇంటికే..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసింది. ఈ మేరకు మూడు విడతల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసింది. మొత్తం రూ.31వేల కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. రాష్ట్రంలో ఇప్పటికీ కొందరికి రైతురుణమాఫీ డబ్బులు అకౌంట్లలో జమ కాలేదు. దాంతో..అలాంటి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్‌కార్డు లేకపోవడం, ఆధార్ కార్డులో తప్పులు, పట్టాపాస్ పుస్తకంలోని పేరుతో సరిపోలకపోవడం వంటి ఇతరత్రా కారణాలతో కొందరికి రుణమాఫీ కాలేదు. ఈ రైతులకు ప్రభుత్వం తాజాగా చల్లని కబురు చెప్పింది.
ఇప్పటికీ రుణమాఫీ అందని రైతులకు డబ్బులు అందించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రైతుల వివరాలను సేకరించేందుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్' ను తెలంగాణ వ్యవసాయశాఖ రూపొందించింది. ఈ యాప్‌ను అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, డివిజన్, మండల స్థాయిలోని ఇతర అధికారులకు పంపించింది ప్రభుత్వం. యాప్ ద్వారా రుణమాఫీ అందని రైతుల వివరాలను సేకరించి.. నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్టు 27వ తేదీ నుంచి ఈ సర్వే ప్రారంభం కానుంది. యాప్‌లో వివరాలు నమోదు అయిన తర్వాత ఆయా రైతుల ఖాతాల్లో రుణమాఫీ అమౌంట్‌ను ప్రభుత్వం జమచేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అర్హులైనా రుణమాఫీ వర్తించని రైతుల ఇంటికే అధికారులు నేరుగా వెళతారు. ముందుగా వారి లోన్ అకౌంట్లు, ఆధార్ కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా తీసుకొని యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు.