తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 12 Feb 2024 5:22 PM ISTతెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు సైతం బదిలీ అయ్యారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి బదిలీలు జరుగుతున్నాయి. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలను చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈసీ మార్గదర్శకాల మేరకు 14 మంది సూపరింటెండెంట్లను బదిలీ చేశారు అధికారులు. పార్లమెంట్ ఎన్నికలు జరిగే వరకు రాబోయే రోజుల్లో మరికొన్ని శాఖల్లో కూడా బదిలీలు జరుగుతాయని తెలుస్తోంది.
తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో తాజాగా 14 మంది సూపరింటెండెంట్లతో పాటు, ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్సైజ్ శాఖలో దీంతో గడిచిన నాలుగేళ్ల కాలంలో మూడేళ్లుగా ఒకే రెవెన్యూ జిల్లాలో పనిచేస్తున్న వారికి ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానచలనం కల్పించారు. ఇప్పటికే రాష్ట్రంలో 395 మంది ఎంపీడీవోలు, 132 మంది తహసీల్దార్లు, 33 మంది నాయబ్ తహసీల్దార్లు బదిలీ అయిన సంగతి తెలిసిందే.