తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. వీఓఏల జీతాలు పెంపు
తెలంగాణ ప్రభుత్వం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వీఓఏ) వేతనాలను నెలకు రూ.8,000కు పెంచింది.
By అంజి Published on 1 Sept 2023 7:25 AM ISTతెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. వీఓఏ జీతాలు పెంపు
తెలంగాణ ప్రభుత్వం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వీఓఏ) వేతనాలను నెలకు రూ.8,000కు పెంచింది. రక్షా బంధన్ కానుకగా సెప్టెంబర్ నుంచి వీఓఏల వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 17,608 ఐకేపీ మహిళా సంఘాలు లేదా వీఓఏలకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీని ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.106 కోట్ల అదనపు భారం పడుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. పూర్వపు ఆంధ్రప్రదేశ్‌లో వీఓఏలు ఆర్థిక అంశాలలో స్వయం సహాయక బృందాలకు స్వచ్ఛందంగా తమ సేవలను విస్తరింపజేసేవారు, డేటాను సంకలనం చేసేవారు. వీరికి కేవలం రూ.2వేలు గౌరవ వేతనం అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారికి 2016లో రూ.3,000 వేతనాలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఆ తర్వాత ప్రభుత్వం వీఓఏలకు కూడా పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ)ని వర్తింపజేసి, మానవతా దృక్పథంతో వారి వేతనాన్ని రూ.3,900కి పెంచింది. దీంతో వీఓఏలకు స్వయం సహాయక సంఘాల నుంచి రూ.2వేలు కలిపి రూ.5,900లు అందుతున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మంత్రివర్గ సహచరులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి వీఓఏ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలను వారికి హరీశ్ రావు తెలియజేశారు. జీతాలు పెంచడంతో సంతోషం వ్యక్తం చేసిన వీఓఏలు మంత్రులకు రాఖీలు కట్టి సీఎంకు రుణపడి ఉంటామన్నారు. వారి యూనిఫామ్‌ల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని, మూడు నెలల స్థానంలో ప్రతి సంవత్సరం ఉద్యోగాల రెన్యూవల్ ప్రక్రియను అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. తమకు జీవిత బీమా పథకం అమలు చేయాలని వీఓఏలు కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు.