తెలంగాణ ఎన్నికల్లో 'ఓట్‌ ఫ్రమ్ హోమ్'.. ఎవరికోసం అంటే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఓట్ ఫ్రమ్‌ హోం విధానాన్ని అమలు చేయనున్నట్లు ఎలక్షన్ కమిషన్ అధికారులు చెబుతున్నారు.

By Srikanth Gundamalla  Published on  22 Sep 2023 5:52 AM GMT
Telangana, Elections, Vote From Home, Election Commission,

తెలంగాణ ఎన్నికల్లో 'ఓట్‌ ఫ్రమ్ హోమ్'.. ఎవరికోసం అంటే..

కేంద్రం ఈ సారి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తుందని అందరూ భావించారు. కానీ.. ఇప్పుడు ఆ ఆలోచన లేదని తెలియడంతో తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలు అయ్యింది. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్‌ 95 శాతం అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగిలిన పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే టికెట్‌ లభించిన కొందరు నాయకులు నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 3న ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణకు రానున్నారు. దాంతో.. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే.. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఓట్ ఫ్రమ్‌ హోం విధానాన్ని అమలు చేయనున్నట్లు ఎలక్షన్ కమిషన్ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేశారు ఎన్నికల అధికారులు. దాంతో..అదే విధాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు తమ ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించనున్నారు. 80 ఏళ్ల వయసు పైబడిన వారు నడిచేందుకు వీలు ఉండదు.. ఓటింగ్ కేంద్రానికి వచ్చేందుకు వారు ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు అయితే.. నడవలేక ఓటు వేయడమే మానుకుంటున్న సంఘటనలూ ఉన్నాయి. దాంతో.. ఎన్నికల సంఘం ఓట్‌ ఫ్రం హోమ్‌ విధానాన్ని తీసుకొస్తుంది. వృద్ధుల అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఓట్‌ ఫ్రమ్ హోమ్ అమలు చేయనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

వృద్ధుల ఇంటి వద్దకు వెళ్లి ఓటింగ్‌ చేయించడం ద్వారా ఓటింగ్‌ శాతం కూడా పెరుగుతుందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. తెలంగాణలో ఓటర్లలో 80 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ఎన్నికల సంఘం ఈ అవకాశం కల్పిస్తుందని సమాచారం. అయితే.. ఓట్‌ ఫ్రమ్ హోమ్ కోసం ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 80 ఏళ్లు దాటిన ఓటర్లు 4.87 లక్షల మంది ఉన్నారు. ఇందులో ముందుగా దరఖాస్తు చేసుకున్న వారి కోసం పోస్టల్ బ్యాలెట్ ను సిద్ధం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Next Story