తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా టీడీపీ..!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగతోంది.
By Srikanth Gundamalla Published on 29 Oct 2023 12:24 PM ISTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా టీడీపీ..!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగతోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఏపీ స్కిల్ డెవల్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన్ని బయటకు తీసుకొచ్చచేందుకు పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, లాయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈక్రమంలో అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టలేమని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. తమకున్న వనరులు.. సామర్థ్యాల్ని ఏపీ మీదనే పెట్టే ఆలోచనలో ఉన్న పార్టీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
శనివారం ములాఖత్ సందర్భంగా రాజమండ్రి జైలులో చంద్రబాబుని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. ఏ పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందో తెలంగాణ నేతలకు వివరించాలని కాసానికి ఆయన సూచించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ.. అంతో ఇంతో బలంగా ఉన్న టీడీపీ.. ఆ తర్వాత నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. 2014లో తెలంగాణలో ఒక మోస్తరు సీట్లను సొంతం చేసుకుంది టీడీపీ. అయితే.. ఈ ఎన్నికలకు ముందు కూడా కాస్తో కూస్తో పుంజుకుంటున్నట్లు కనిపించింది. రెండు సభలు నిర్వహిస్తే సక్సెస్ కావడంతో.. పూర్తిస్థాయిలో పోటీ చేసుందుకు ముందుగా సుముఖత వ్యక్తం చేశారు. కాసాని కూడా అన్ని సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ.. చర్చోపర్చల తర్వాత పోటీకి దూరంగా ఉండటమే మేలని టీడీపీ భావించినట్లు ప్రచారం జరుగుతోంది. పోటీ చేస్తే పూర్థి స్థాయిలో యుద్ధం చేయాలే తప్పించి నామమాత్రంగా చేయటం సరికాదన్న అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆషామాషీగా పోటీ చేసి.. సరైన ఫలితాలు రాలేదని బాధ పడే కన్నా.. పోటీకి దూరంగా ఉండటం మేలు అన్న మాటను చెప్పినట్లుగా చెబుతున్నారు.
టీడీపీ పోటీ చేయదని తేలకముందు కాసాని పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ భావిస్తోన్న నేపథ్యంలో కాసాని పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాసాని మాత్రం పార్టీ మారుతున్న అంశాన్ని కొట్టి పారేశారు. మరి మున్ముందు ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.