ఓటర్ ఐడీ ఉన్నంత మాత్రాన జాబితాలో పేరున్నట్లు కాదు: ఎన్నికల అధికారి
ఓటర్లకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి పలు సూచనలు చేశారు.
By Srikanth Gundamalla
ఓటర్ ఐడీ ఉన్నంత మాత్రాన జాబితాలో పేరున్నట్లు కాదు: ఎన్నికల అధికారి
తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌కు టైమ్ దగ్గరపడుతోంది. దాంతో.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులతో కలిసి ముమ్మరంగా వాహనతనిఖీలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీ ఎత్తున నగదు, బంగారం, మద్యం పట్టుబడుతున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో కొత్తగా ఓట్లు నమోదు చేసుకుంటున్నారు. ఓటర్లకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి పలు సూచనలు చేశారు.
ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని... జాబితాలో తమ పేరు చెక్ చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ సూచించారు. ఓటర్ ఐడీ కార్డు ఉన్నంత మాత్రాన మీ ఓటు ఉందని భావించకూడదని అన్నారు. జాబితాలో పేరుని రీచెక్ చేసుకోవాలని రొనాల్డ్ రోస్ తెలిపారు. హైకోర్టులో స్వీప్ యాక్టివిటీ కింద ఏర్పాటు చేసిన రీ-చెక్ యువర్ ఓటర్ కౌంటర్‌ను డిప్యూటీ డీఈవో అనుదీప్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు హైకోర్డు జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బంది మాట్లాడి ఓటరు జాబితాలో తమ పేరు ఎలా చెక్ చేసుకోవాలో అవగాహన కల్పించారు. voter.eci.gov.in లేదా voter helpline app ద్వారా ఓటరు జాబితాలో మీ పేరును చెక్ చేసుకోవచ్చని తెలిపారు. ఇతర సందేహాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950ను సంప్రదించాలని ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ సూచించారు.