రండి ఓటేద్దాం.. మ్యూజిక్ బ్యాండ్లతో ఆకర్షిస్తోన్న ఈసీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  30 Nov 2023 1:53 PM IST
telangana, elections, polling, music bands,

రండి ఓటేద్దాం.. మ్యూజిక్ బ్యాండ్లతో ఆకర్షిస్తోన్న ఈసీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పట్టణప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ స్వగ్రామాలకు ఇంకా వెళ్తూనే ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. పట్టణం, నగరాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఓటింగ్ శాతం ఇప్పటికి వరకు అయితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అధికారులు వినూత్న ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నగర ఓటర్ల భాగస్వామ్యం చేసేందుకు ఎన్నికలను ఒక పండగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక మ్యూజిక్ బ్యాండ్‌లను ఏర్పాటు చేశారు. సరూర్‌నగర్‌లోని బూత్‌ నెంబర్ 188 వద్ద మ్యూజికల్ బ్యాండ్‌ అందరినీ ఆకర్షించింది. అక్కడికి ఓటు వేసేందుకు వస్తున్న వారికి ఆ ప్రత్యేక మ్యూజిక్ బ్యాండ్ స్వాగతం పలుకుతోంది.

పలువురు మహిళలు సన్నాయి ఊదుతుండగా.. ఇంకొందరు డ్రమ్స్‌ కొడుతూ వాయిద్య పరికారలతో ఓటర్లను ప్రోత్సాహ పరుస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఓటు వేసేవారికి మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అక్కడికి వచ్చిన వారంతా అంటున్నారు. ఎన్నికల సంఘం అధికారుల ప్రయత్నాలు బాగున్నాయని చెబుతున్నారు. అలాగే నగరాల్లో ఉండే అందరూ బయటకు రావాలని.. ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటూ సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు ప్రముఖులు పిలుపునిస్తున్నారు.

ఓటింగ్ శాతం గురించి మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్.. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. కొన్ని చోట్ల ఈవీఎంల సమస్యలు వస్తే వెంటనే కొత్తవి మార్చామని వెల్లడించారు. అర్బన్‌ ఏరియాల్లో పోలింగ్ శాతం ఇంకా పెరగాలని కోరారు. సాయంత్రం వరకు సమయం ఉంది కాబట్టి ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు వికాస్‌ రాజ్. అలాగే కొన్ని చోట్ల గొడవలు, ఘర్షణలు జరిగాయని అన్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై డీఈవోను రిపోర్టు అడిగినట్లు వికాస్‌ రాజ్ వెల్లడించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కంప్లైంట్స్‌ వచ్చాయని చెప్పారు.

Next Story